Thursday, 31 July 2014

TSSA Warangal RTE Act 2019 Highlights in Telugu(Telugu Pamphlet on RTE


సర్వ  శిక్షా అభియాన్- వరంగల్ జిల్లా,
బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009



                  
అందరికి విద్య అనే లక్ష్యంతో 6-14 సంవత్సరాల పిల్లలందరు బడిలో చేరి ఉచితంగా చదువుకోవడానికి భారత ప్రభుత్వం ఆమోదించిన బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009 ( విద్యా హక్కు చట్టం) 1వ తేదీ ఏప్రిల్ ,2010 నుండి అమలు లోకి వచ్చింది.


విద్యా హక్కు చట్టం లోని ముఖ్యాంశాలు:

  • 6-14 సంవత్సరాల పిల్లలందరు పరిసర ప్రాంత పాఠశాలలో ఎలిమెంటరీ విద్య ను (1 నుండి 8వ తరగతి) పూర్తి చేసే వరకు ఉచితంగా విద్యను పొందే హక్కు ను కలిగి ఉంటారు.
  • పాఠశాలల ఏర్పాటు , పాఠశాల భవనం,అదనపు తరగతి గదులు , బోధనా సిబ్బంది , బోధనోపకరణములతో సహ మౌలిక సదుపాయములను కల్పించడానికి సంబధిత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
  • తమ పరిధిలో నివసిస్తున్న 14 ఏళ్ల లోపలి పిల్లలందరి రికార్డులను నిర్వహించడం,ప్రతి ఒక్క బాలుడు లేదా బాలిక బడిలో చేరి , క్రమం తప్పకుండా హాజరవుతూ , ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేలా పర్యవేక్షించే బాధ్యత మరియు పాఠశాలల్లో మౌలిక సదుపాయములనుకల్పించే బాధ్యత స్థానిక ప్రభుత్వం పై ఉంటుంది.
  • తమ పిల్లలను పరిసర ప్రాంత పాఠశాలల్లో చేర్పించడం ప్రతీ తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బాధ్యత.
  • మౌళిక వసతులు:అన్ని పాఠశాలల్లో అన్నీ కాలాలకు అనువైన భవనములో ప్రతీ ఉపాధ్యాయునికి ఒక తరగతి గది , ప్రధానోపాధ్యాయుల గది, ఆడపిల్లలకు,మగ పిల్లలకు వేరు వేరు గా మరుగు దొడ్లు, మంచినీటి సౌకర్యం, వంట గది, ఆటస్థలం, ప్రహరీ గోడ లేదా కంచె, వికలాంగులు ప్రవేశించడానికి ర్యాంపు ఉండవలెను.
  • ఉపాధ్యాయుల సంఖ్య: ఈ చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 తరగతులు బోధించడానికి 60 మంది పిల్లల వరకు ఇద్దరు, 61 నుండి 90 వరకు ముగ్గురు,91 నుండి 120 వరకు నలుగురు,121 నుండి 150 వరకు అయిదుగురు , 151 నుండి 200 వరకు అయిదుగురు ఉపాధ్యాయుల తో పాటు ప్రధానోపాధ్యాయులు,200 కి మించి పిల్లలు ఉన్నట్లైతే ప్రధానోపాధ్యాయులను మినహాయించి 40 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలి.
  • ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుండి 8 వ తరగతి వరకు ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండవలెను.విజ్ణాన శాస్త్రం /లెక్కలు, సామాజిక శాస్త్రం , భాషలు బోధించడానికి కనీసం ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండవలెను.ప్రతీ 35 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, పిల్లల సంఖ్య 100 దాటితే పూర్తి కాల ప్రధానోపాధ్యాయుడు మరియు చిత్రకళ, ఆరోగ్యం/వ్యాయామ విద్య, వృత్తి విద్యలు బోధించడానికి పార్ట్ టైమ్ బోధకులను నియమించాలి.
  • నిర్ధారించిన కనీస అర్హతలు ఉన్న వారినే ఉపాధ్యాయులుగా నియమించాలి.
  • బడిలో ప్రవేశ విధానం: బడిలో పిల్లల ప్రవేశానికి ఎంపిక విధానం, క్యాపీటేషన్ రుసుం ఉండకూడదు. ఒకవేళ క్యాపీటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి పది రేట్లు జరిమానా, ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి సారి తప్పుకు 25,000 రూపాయలు, ఆ తరువాత ప్రతీ సారి తప్పుకు 50,000 రూపాయలు జరిమానా విధించవచ్చు.
  • జనన ధ్రువీకరణ పత్రం లెదా సిఫారసు చేసిన ఇతర పత్రం ఆధారముగా వయస్సును నిర్ధారించి పిల్లలను వయస్సుకు తగిన తరగతి లో చేర్చుకోవాలి.అయితే వయస్సు నిర్ధారణ పత్రం లేదనే కారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు.
  • బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతి లో మళ్ళీ కొనసాగించడం లేదా బడి నుండి తీసివేయడం (ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యేంత వరకు) చేయకూడదు.
  • పిల్లలకు వారి తరగతి సామర్ధ్యములు లేకపోతే ప్రత్యేక శిక్షణ అంద చేయాలి.
  • పిల్లలను శారీరకంగా శిక్షించడం,మానసికంగా వేధించడం నిషేధించనైనది.ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే వారి ఉద్యోగ నియమాల ఆధారంగా క్రమశిక్షణా చర్యకు గురి అవుతారు.
  • ఉపాధ్యాయుల విధులు: సమయ పాలన పాటించడం,సకాలములో పాఠ్యాంశములను బోధించడం, పిల్లల సామర్ధ్యాన్ని అంచనా వేసి అవసరమైతే అదనపు బోధన చేయడం, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతి ని వారికి తెలియజేయ్యడం వంటి విధులు ఉపాధ్యాయులు నిర్వహించాలి.
  • మూల్యాంకనం,పరీక్షా విధానం: పిల్లల  పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులు అభివృద్ది చెందాలి.వారి సామర్ధ్యముల పై నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉండాలి.ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యేంత వరకు పిల్లలు ఎటువంటి బోర్డు పరీక్షకు హాజరు కావలిసిన ఆవసరం లేదు.
  • పాఠశాల యాజమాన్య కమిటీ: ప్రైవేటు పాఠశాలలు మినహాయించి మిగిలిన అన్నీ పాఠశాలల్లో స్థానిక ప్రభుత్వానికి ఎంపికైన ప్రజా ప్రతినిధులతో, ఆ బడిలో చదువుచున్న పిల్లల తల్లిదండ్రుల / సంరక్షకులు,ఉపాధ్యాయులతో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి.కనీసం ప్రతి 2 నెలెలకొకసారి ఈ కమిటీ సమావేశమై పాఠశాల పనితీరును సమీక్షించడం, బడి అభివృద్ది ప్రణాళికను తయారుచేయడం నిధుల వినియాగాన్ని పర్యవేక్షించడం వంటి విధులను నిర్వహించాలి.
  • పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం తీర్మానాలను రాతపూర్వకముగా నమోదు చేసి అందరికి అందుబాటులో ఉంచాలి .ప్రభుత్వం/సర్వ శిక్షా అభియాన్ ద్వారా పాఠశాలకు విడుదలైన నిధుల వినియాగమునకు ఈ తీర్మానాలు తప్పనిసరి అవసరం.
  • పాఠశాల గుర్తింపు: సంబధిత ఆధికృత సంస్థ నుండి గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించరాదు. ఈ చట్టం ప్రకారం సరైన ప్రమాణాలు, నియమాల ప్రకారం లేకుంటే ఆ బడికి గుర్తింపు రద్దు చేయాలి.గుర్తింపు ధృవీకరణ లేకుండా బడి నడిపినా లేదా గుర్తింపు రద్దు అయిన తరువాత కూడా బడిని నడిపినా లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఒకవేళ ఉల్లంఘన ఇంకా కొనసాగితే అలాంటి కాలానికి ప్రతీరోజుకు పదివేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.


      పాఠశాలల ఏర్పాటు, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, బోధన సిబ్బంది,బోధన పరికరాలతో సహ మౌలిక సదుపాయములు కల్పించుట, బాలికల విద్యను ప్రోత్సహించుటకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయముల ఏర్పాటు, బడి బయటి పిల్లలను బడిలో చేర్చి ప్రత్యేక శిక్షణా కేంద్రములను ఏర్పాటు చేయడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు  విలీన విద్యా సౌకర్యాలు కల్పించుట, తరగతి గదుల మరమ్మత్తులు, మరుగుదొడ్ల నిర్మాణం, ర్యాంపులను నిర్మించుట, ఉపాధ్యాయులకు శిక్షణ,పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేపించి,సమాజ సభ్యులకు శిక్షణా కార్యక్రమములను నిర్వహించడం,పిల్లలకు ఉచిత యూనిఫామ్స్, పాఠశాలలు లేని అవాసములోని పిల్లలకు రవాణా భత్యం చెల్లించుట వంటి అనేక కార్యక్రమముల ద్వారా విద్యా హక్కు చట్టం అమలుకు సర్వ శిక్షా అభియాన్ బాధ్యత వహిస్తుంది.
మండల స్థాయి లో మండల విద్యాశాఖాధి గారు తన పరిధిలోని అన్నీ అవాసములలో, పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు ను పర్యవేక్షిస్తూ, తగు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం, సర్వ శిక్షా అభియాన్ మరియు సమాజ సభ్యుల సహకారం తో పాఠశాల లో విద్యా హక్కు చట్టం నిర్దేశించిన సదుపాయములను కల్పించుటకు ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలి. 
                                            జిల్లా కలెక్టర్ మరియు ఛైర్మన్
                                                   సర్వ శిక్షా అభియాన్, వరంగల్.