Monday 21 July 2014

Implement School Academic Activities for this Academic Year 2014-15

తెలంగాణ సర్వ శిక్ష అభియాన్, వరంగల్ జిల్లా
సోదర, సోదరీమనులైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికి
నమస్కారములు..........
          ప్రస్తుతము మనము 2014-15 విద్యా సంవత్సరములో మొదటి పాఠశాల సముదాయ సమావేశమును నిర్వహించుకుంటున్నాము. అయితే కొంత మంది ఉపాధ్యాయులు పాఠశాల సముదాయ సమావేశములను ఫలప్రదంగా వినియోగించుకోలేకపోతున్నారని నేను భావిస్తున్నాను. దానికి కారణాలు మనమే అన్వేషించుకొని పాఠశాల సముదాయ సమావేశాల ఉద్దేశాలైన క్రింది వాటి సాధనకు మనమందరము కృషి చేయవలసి ఉన్నది.


  • Ø  గుణాత్మక విద్యాసాధనలో నూతన బోధనా పద్ధతులను పాటించుట
  • Ø  NCF-2005, SCF-2011 మరియు RTE-2009 లక్ష్యాలను అమలుపరుచుట
  • Ø  పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం చేయుట
  • Ø  విలువలతో కూడిన విద్య నందించుట
  • Ø  ఉపాధ్యాయ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుట కొరకు
  • Ø  నూతన పాఠ్యపుస్తకాలతో పాటు అభ్యసనాభివృద్ధి కార్యక్రమములో నిరంతర సమగ్ర మూల్యాంకనము (CCE) పై అవగాహనకు ఉపాధ్యాయుల అనుభవాలను పంచుకొనుట.
గత సంవత్సరం రాష్ట్ర స్థాయి సాధన సర్వేను (SLAS) సర్వ శిక్ష అభియాన్, ఆంద్రప్రదేశ్ ద్వారా రాష్ట్రమంతట నిర్వహించనైనది. అందులో మన వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ క్రింది అంశాలను గమనించడమైనది.
  • Ø  అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఎలిమెంటరీస్థాయి విద్యార్థుల సామర్ధ్యాల సాధనలో వరంగల్ జిల్లా 15వ స్థానములో ఉన్నది. తెలంగాణ రాష్ట్రములో ఆరవ స్థానములో ఉంది.
  • Ø  తెలుగు, ఆంగ్లములలో విద్యార్థుల సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి.
  • Ø  A+, A, B+, B గ్రేడులలో ఉన్న విద్యార్థుల కంటే ‘C’ గ్రేడ్ లోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
  • Ø  8వ తరగతిలో A+ గ్రేడ్ విద్యార్థులు లేరు.

వీటిని గమనించి ఈ వేసవిలో ‘C’ గ్రేడ్ పిల్లలు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో జిల్లాలో CRPల ద్వారా “వేసవి శిక్షణ శిభిరాలు” నిర్వహించనైనది. అవి కొంత వరకు సత్ఫలితాలనిచ్చాయి. తదనంతరము పాఠశాల పునః ప్రారంభము అయిన తరువాత జూన్ 16 నుండి జూన్ 30 వరకు “సంసిద్ధత కార్యక్రమము”ను నిర్వహించనైనది. కానీ ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాము.
          పై విషయాలు అన్నీ గమనించి మన విద్యార్థులలో అందరూ కూడా గుణాత్మక విద్య పొందుటకు, తరగతి వారి సామర్ధ్యాలు సాధించుటకు కృతనిశ్చయులు కావాలి. దీని కొరకు రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారి గారి ఆదేశాల మేరకు ప్రేరణ” కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది.
ప్రేరణ
ప్రేరణ” అనునది గుణాత్మక విద్య సాధనలో భాగంగా విద్యార్థులలో చదువుట (Reading), రాయుట (Writing) మరియు గణిత నైపుణ్యాలు (Arithmetic Skills with Reasoning) 3’R’s ను అక్టోబర్, 2014 వరకు సాధించే కార్యక్రమము.
ప్రేరణ ఎవరి కొరకు ?
3 నుండి 8 వ తరగతి వరకు విద్యనభ్యసిస్తూ కనీస సామర్థ్యాలు ప్రదర్శించలేని విద్యార్థుల కొరకు.
ఉపాధ్యాయులుగా మనం ఏమి చేయలి ?
  • ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లో, వారి వారి సంబంధిత విషయాలలో కనీస సామర్ధ్యాలు ప్రదర్శించలేని విద్యార్థులను గుర్తించాలి.
  • చదవడము, రాయడము, గణితసామర్ధ్యాలు అందించుటకు విద్యార్థి వారిగా రెమెడియల్ బోధన చేయాలి.
  • ఈ కార్యక్రమమును ఆగష్టు 1వ తేదీన మొదలు పెట్టి 31 అక్టోబర్, 2014 వరకు అవసరమైన విద్యార్థులకు అమలు చేయాలి.
  • ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో దీనిపై సమీక్ష నిర్వహించి, విద్యార్థుల అభివృద్ధిని నమోదు చేయాలి.
  • తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ 2014 సంవత్సరమును “గుణాత్మక విద్య సాధన సంవత్సరముగా” నిరూపిద్ధాం.

పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయమిత్రులందరు ఈ కార్యక్రమము మన విద్యార్థుల కోసం మన అందరిదిగా గుర్తించి, సహకరించి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ .......
                                                                                      ఇట్లు
                                                                                      ఎ. శ్రీనివాస్
                                                                                      అకడమిక్ మానిటరింగ్ అధికారి,
                                                                                      తెలంగాణ సర్వ శిక్ష అభియాన్,
                                                                                      వరంగల్ జిల్లా

“విద్య పిల్లల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసి వారి ఊహలకు జీవం పోస్తుంది.
వారి బ్రతుకు బాటను బంగారుమయం చేస్తుంది. ఎందరో విద్యావేత్తల్ని,
శాస్త్రవేత్తల్ని, డాక్టర్లని, ఇంజనీర్లని, లాయర్లని, మరెందరో జాతి నిర్మాతలను
ఈ సమాజనికి అందిస్తుంది.”

-      డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్